సంక్రాంతి సంబురాలు సమీపిస్తున్నా.. కోడి పందాలపై ఇంకా స్పష్టతరాలేదు. ఈ విషయమై హైకోర్టు ఎటూ తేల్చలేదు. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, గ్రామ పెద్దలు దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కనీసం 50 చోట్ల కోడిపందాల నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పోలీసులు కూడా అటువైపు వెళ్లకుండా ప్రజాప్రతినిధులు ముందుగానే తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కోడిపందాలకు సంబంధించి దాదాపు రూ. 100 కోట్ల వరకు బెట్టింగ్‌లు కొనసాగవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇక కృష్ణా జిల్లాలోనూ పెద్దమొత్తంలోనే కోడిపందాల సందర్భంగా చేతులు మారే అవకాశాలున్నాయి. ప.గో.లోని వెంప, వేములదీవి, అచంట, పెనుగొండ, పెనుమంట్ర, యలమంచలి, ఐ. భీమవరం, జువ్వలపాలెం తదితరచోట్లలో కోడిపందాలు జోరుగా సాగనున్నాయి. ఇక్కడ పందాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి బిగ్‌షాట్స్ తరలివెళ్లనున్నారు.