జగన్‌కు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ రాజకీయ నాయకుడి అక్రమాస్తుల కేసులో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి పలువురు ఐఏఎస్ అధికారులు కూడా రిమాండ్ ఖైదీలుగా జైలు శిక్షను అనుభవించకతప్పలేదు. ఇక సీనియర్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభపై కూడా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో ఆమెను విధులనుంచి తప్పించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తనను బాధ్యురాలిని చేయడం సబబు కాదంటూ ఆమె గతంలో హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్కడి విచారణలో రత్నప్రభపై కేసు నమోదు చేయడాన్ని సుప్రీం తప్పుబట్టింది. ఆమెకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టేసింది. దీంతో రత్నప్రభకు ఉపశమనం లభించింది. అయితే భవిష్యత్తులో చార్జిషీటు విచారణలో ఆమె తప్పు చేసినట్లు తేలితే మాత్రం ఆమెకు కష్టాలు తప్పకపోవచ్చు.