తెలంగాణకు గడ్డుకాలం రాబోతోంది. వచ్చే నెల నుంచి ఓ ప్రధాన సమస్య ప్రజలను ముచ్చెమటలు పట్టించబోతోంది. గతంలో తెలంగాణలో ఎన్నడూ లేనంతగా ప్రజలు కరెంటు కోతలకు సిద్ధంకాక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం చలికాలం కావడంతో కరెంటుకు డిమాండ్ తగ్గి కోతలు పెద్దగా లేవు. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 128 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ఇది అక్కడికక్కడికి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు సరిపోతోంది. ఇక వచ్చేనెల నుంచి వేసవి ప్రారంభం కానుండటంతో విద్యుత్‌కు డిమాండ్ పెరగనుంది. అదే సమయంలో జలాశయాల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో క్రమేణ విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గుతూ వస్తోంది. గత నెలలోనే నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయగా శ్రీశైలం నుంచి అడపాదడపా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి మాసంలోనే కనీసం రోజుకు 140 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని, ఇక ఏప్రిల్, మేనెలల్లో ఇంతకుమించి కరెంటు డిమాండ్ ఉంటుందని ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించారు. అప్పటికి శ్రీశైలం జలాశయం నుంచి కరెంటు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోనుంది. ఇక దాన్నిబట్టి నగర ప్రాంతంలోనే రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల కోతలు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి అవకాశమున్న అన్ని మార్గాలను అన్వేషించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ పనిపై నెల రోజులుగా ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నా.. ఎలాంటి ఫలితం కనబడకపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేసే విషయమే.