'సాక్షి' దిన పత్రిక ఆరంభంలోనే 11 లక్షల సర్క్యులేషన్‌తో అదరగొట్టింది. దశాబ్దాలుగా తెలుగునాట సమీప పోటీ కూడా లేకుండా కొనసాగుతున్న 'ఈనాడు'కు కూడా చెమటలు పట్టించింది. మొదట్లో ఇది ఫక్తు కాంగ్రెస్ పత్రిక అని తెలిసినా యాజమాన్యం బ్యాక్‌గ్రౌండ్, ఉద్యోగుల హర్డ్‌వర్క్ ఆ పత్రికను గత ఏడేళ్లుగా కూడా నం. 2 స్థానం నుంచి వెనక్కి వెళ్లకుండా నిలుపుతున్నాయి. కాని ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో ఈ పత్రిక భవితవ్యం ప్రమాదంలో పడింది. కాస్ట్ కట్టింగ్ పేరుతో ఉద్యోగాల్లో కోతలు సిబ్బందిని తీవ్రంగా వేధిస్తున్నాయి. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఈ పత్రికకు యూనిట్లు ఉన్నాయి. సంబంధిత డెస్క్ వర్క్ కూడా గతంలో అక్కడే జరిగేది. అయితే 'ఈనాడు' డెస్క్ వర్క్‌ను కొన్ని జిల్లాలకే పరిమితం చేస్తుందన్న సమాచారంతో 'సాక్షి' మరింత దూకుడుగా ముందుకువెళ్లి డెస్క్ వర్క్‌లను క్లబ్ చేసింది. దీంతో అప్పటికప్పుడు భార్యాపిల్లలను వదిలిపెట్టి ఉద్యోగులు బతుకుజీవడా అనుకుంటూ హైదరాబాద్, వైజాగ్, వరంగల్, రాజమండ్రి బాట పట్టారు. అప్పటికీ ఆగని యాజమాన్యం ఉద్యోగుల సంఖ్యలో కోత విధించింది. దీంతో వందమందికిపైగా ఉద్యోగులతో బలవంతంగా రాజీనామా చేయించినట్లు సమాచారం. అయితే వీరిలో చాలామంది కూడా చిరుద్యోగులు ఉండటం, వారి వేతనాలు రూ. 10 వేల నుంచి రూ. 15 వరకే ఉన్నట్లు సమాచారం. మరోవైపు వేలకు వేల జీతాలు తీసుకుంటున్న పెద్దస్థాయి ఉద్యోగుల జోలికి యాజమాన్యం రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల కోతల్లోనూ కుల సమీకరణాలు పాటిస్తూ చిరుద్యోగుల కడుపుపై కొడుతున్నట్లు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆరోపిస్తున్నారు. పేదల అభివృద్ధికి పాటుపడతానని చెప్పే జగన్ దినపత్రికలోనే ఇలా జరుగుతున్నా.. అటు రాజకీయపక్షాలుగాని ఇటు ప్రభుత్వంగాని ఈ విషయమై స్పందించిన దాఖలాలు కనబడటం లేదు. ఇక ప్రస్తుత పరిణామాలన్ని చూస్తుంటే 'సాక్షి' తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగ భద్రత కరువవడంతో సిబ్బంది ఆందోళనలో ఉన్నారని, ఏ సమయంలో ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి నెలకొందనే విమర్శలు వినబడుతున్నాయి. దీంతో పేపర్‌క్వాలిటీ పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. ఇక గతంలో 'ఈనాడు'కు ముచ్చెమటలు పోయించిన 'ఉదయం' పత్రిక ఆ తర్వాత కొన్నాళ్లకే కనుమరుగైంది. ఇక ప్రస్తుత పరిణామాలన్ని చూస్తుంటే 'సాక్షి' మరో 'ఉదయం'గా మారే అవకాశాలు కనబడుతున్నాయని ఆ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందే చెబుతున్నారు. మొదట జగన్ దేశాన్ని ఉద్దరించే విషయాన్ని పక్కనబెట్టి తన సంస్థ ఉద్యోగులు వేధింపులకు గురికాకుండా వారి సంక్షేమం కృషి చేస్తే బాగుంటుందని అక్కడ పనిచేస్తున్న వారు విమర్శిస్తున్నారు.