'లౌక్యం' వంటి ఒకే ఒక్క హిట్ హీరో గోపీచంద్ కెరీర్ ను పూర్తిగా మార్చివేసింది. ఆయన తాజాగా నటిస్తున్న 'జిల్' చిత్రం బిజినెస్ కూడా బాగా ఊపందుకొంది. దీంతో గోపీచంద్ కూడా ఇక తన చిత్రాల్లో ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. కాగా గతంలో డైరెక్టర్ మారిపోయి, ఫైనాన్స్ ట్రబుల్స్ తో ఇబ్బంది పడి.. ఇలా పలు కారణాల వల్ల ఆగిపోయిన గోపీచంద్-బి.గోపాల్ ల చిత్రం మరలా పట్టాలెక్కింది. ఈ చిత్రం లో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికి ఫైనాన్స్ చేయడానికి ఫైనాన్షియర్స్ ముందుకు రావడంతో షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఇక గోపీచంద్ సూచన మేరకు ఈ చిత్రం లో స్పెషల్ కామెడి ట్రాక్ ను పెడుతున్నట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే.. హీరోయిన్ గా టాప్ హీరోలందరితో కలిసి నటించి, ఆ తర్వాత లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో లేడి అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించనుందని సమాచారం. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆమె ఈ చిత్రంలోని క్యారెక్టర్ బాగా నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. గతంలో బి.గోపాల్ దర్శకత్వంలో ఆమె కొన్ని పవర్ ఫుల్ రోల్స్ చేసింది. ఆ సాన్నిహిత్యం కూడా విజయశాంతి ఈ చిత్రాన్ని ఒప్పుకోవడానికి ఓ కారణమని అంటున్నారు. ఈ చిత్రానికి ఇంతకు ముందు 'జగన్మోహన్ ఐ.పి.యస్' అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రం టైటిల్ ను కూడా మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం.