తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా డిప్యూటీ సీఎం అయిన కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎంపిక కావాల్సి ఉంది. ప్రస్తుతం వరంగల్ ఎంపీగా ఉన్న కడియంను రాష్ట్ర డిప్యూటీ సీఎం చేశారు. దీంతో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎంపిక కాక తప్పదు. మరోవైపు ఇప్పుడు ఎక్కడా ఎమ్మెల్యే సీటుకు ఎన్నికలు లేనందునా ఆయన్ను శాసనసభకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడియం శ్రీహరిని రంగంలోకి దించే అవకాశం ఉంది. ఇక మరో ఆరు నెలల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కడియం మంత్రి పదవిలో కొనసాగవచ్చు. మరోవైపు కడియం రాజీనామాతో ఖాళీ కానున్న వరంగల్ ఎంపీ ఎన్నికల గురించి అప్పుడే రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. తమకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ అప్పుడే నాయకులు పార్టీల అధినేతలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.