రెండు రాష్ట్రాల నడుమ కొనుసాగుతున్న అంతర్యుద్ధలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక కరెంటు లోటుతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ సర్కారు కృష్ణపట్నం ప్లాంటుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర పునర్ విభజన చట్ట ప్రకారం 800 యూనిట్ల సామర్థ్యం కలిగిన ఈ యూనిట్‌నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.21శాతం విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇక నెల్లూరులో ఉన్న ఈ ప్లాంట్‌పై పూర్తిగా ఏపీ ఆధిపత్యం కొనసాగుతోంది. గత ఏప్రిల్‌నుంచే ఇక్కడ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ తెలంగాణకు వాటా ఇవ్వడానికి మాత్రం ఏపీ సర్కారు ససేమిరా అంటోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో దిగివచ్చిన ఏపీ.. ఇంతవరకు కేవలం ట్రయల్‌రన్ మాత్రమే నిర్వహించామని, ఫిబ్రవరిలో వాణిజ్య అవసరాల నిమిత్తం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని, అప్పుడు తెలంగాణ వాట మేరకు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. దీంతో కొంతమేర తమకు కరెంటు కష్టాలు తగ్గుతాయని తెలంగాణ ప్రభుత్వం భావించింది. తీరా మూడు రోజుల క్రితం అధికారికంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన ఏపీ సర్కారు అంతలోనే బొగ్గు కొరత ఉందంటూ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి తెలంగాణకు షాకిచ్చింది. ప్రస్తుతం ఏపీలో చాలినంత విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండటంతో కేవలం తెలంగాణను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికే ఏపీ అధికారులు ఈ ఎత్తుగడ వేశారన్న భావన వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్రాల అధికారిక పోరులో సామాన్యులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుండటం ఎంతైనా విచారకరమే.