మమతాబెనర్జీకి బీజేపీకి అసలు పడటం లేదు. శారదా కుంభకోణంలో కావాలనే తనను ఇరికిస్తున్నారని, తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో అసలు ఆమె కేంద్రంతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు నెరపడానికి ఇష్టపడటం లేదు. ఇందులో భాగంగానే ఆమె ఆదివారం నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరుకాలేదు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి చర్చించారు. అయితే మమతాబెనర్జీ మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అంతేకాకుండా తన గైర్హాజరికి కనీసం కారణాలు కూడా తెలపలేదు. దీంతో ఆమెపై అన్ని వైపుల నుంచి విమర్శల జడివాన కురుస్తోంది. ఇక త్వరలోనే అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమతా తీరు ఏమాత్రం సహేతుకంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాలకు, పరిపాలనకు మమతా లంకె పెట్టడం బాగాలేదని ఆ రాష్ట్ర నాయకులు కూడా విమర్శిస్తున్నారు.