తెలంగాణా ప్రజా సాంస్కృతిక కేంద్రం(టి.పి.ఎస్.కె) సభ్యులు, తెలంగాణా సినీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు సంయుక్తంగా లఘు చిత్రాల పోటీ నిర్వహించుచున్నారు. నేటి సమాజంలో ధనమయంతో కలుషితమవుతున్న మానవసంబంధాలను, సంస్కృతులను విలువలను కాపాడడం అత్యంత ప్రధానంగా భావించి ఈ 'షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్' నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సినీ దర్శక నిర్మాత సానా యాదిరెడ్డి మాట్లాడుతూ "తెలంగాణా రాష్ట్రం వచ్చిన తరువాత మొదటి సారిగా హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో జరుగుతున్న తెలంగాణా జనజాతర ఉత్సవాలలో భాగంగా 'షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్' ను నిర్వహిస్తున్నాము. తెలంగాణా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ లఘు చిత్రాల పోటీ నిర్వహిస్తున్నాం. ఈ లఘు చిత్రాలలో గెలుపొందిన వారికి వివిధ విభాగాలలో అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది" అని చెప్పారు.
టి.పి.ఎస్.కె. కన్వీనర్ జి.రాములు మాట్లాడుతూ "తెలంగాణా ఏర్పడ్డాక తెలంగాణా సంస్కృతిని, తెలంగాణా సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికే ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటిషన్ నిర్వహిస్తున్నాం. ఈ పోటీలో ఔత్సాహికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి. పోటీలో పాల్గొనదలచిన వారు కధాంశాన్ని సామాజిక సమస్యల పరిష్కారంగా ప్రజా ప్రయోజన సంప్రదాయాల రక్షణగా సామాజిక ప్రయోజనం ఉండేలా ఎంపికచేసుకోవాలి" అని చెప్పారు.
సినీ దర్శక నిర్మాత అల్లాని శ్రీధర్ మాట్లాడుతూ "ఈ పోటీ నిర్వహించడానికి ప్రధాన కారణం తెలంగాణా సినీ పరిశ్రమకు అస్థిత్వం ఏర్పడడం కోసమే. అప్ కమింగ్ డైరెక్టర్స్ కు నటీనటులకు ఇది ఓ మంచి అవకాశం. ఈ షార్ట్ ఫిల్మ్ నిడివి 5 నుండి 20 నిమిషాల మధ్యలో ఉండాలి" అని చెప్పారు.
సినీ దర్శకుడు సింగిశెట్టి దశరథ మాట్లాడుతూ "భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ షార్ట్ ఫిల్మ్స్ ఉపయోగపడాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.
సామాజిక కార్యకర్త పద్మ మాట్లాడుతూ "సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలలో భాగంగా ఈ కాంపిటిషన్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రంలో అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
గేయ రచయిత పి.ఎన్.మూర్తి మాట్లాడుతూ "నిష్పక్షపాతంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే విభిన్న రంగాల నుండి జూరి మెంబర్స్ ని సెలెక్ట్ చేసాము. ఫిబ్రవరి 25 షార్ట్ ఫిల్మ్స్ పంపడానికి చివరి తేది" అని అన్నారు.
సినీ నిర్మాత ప్రేమ రాజ్ మాట్లాడుతూ "అందరికి అవకాశం దొరకాలనే ఉద్దేశ్యంతో 500 రూపాయలు మాత్రమే ఎంట్రీ ఫీ గా పెట్టాము. ఈ లఘుచిత్రాలో గెలుపొందిన వారిని మార్చ్ 3 న అనౌన్స్ చేసి ఏకశిల అవార్డుల పేరిట అవార్డులు ఇవ్వనున్నాం" అని అన్నారు.