తమిళ స్టార్ ధనుష్ కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ పై కూడా కన్నేశాడు. పనిలో పనిగా ఇంతకాలం తెలుగులో సరైన సక్సెస్ లేని ఆయనకు ఇటీవల వచ్చిన 'రఘువరన్ బి.టెక్.' మూవీ మంచి హిట్టు కావడం కలిసొచ్చింది. దీంతో తన ప్రతి తమిళ చిత్రాన్ని తెలుగులోకి దింపేలా జాగ్రత్తలు తీసుకుంటూ సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఇక మన చోటా చోటా నిర్మాతలు ఎప్పుడో తమిళంలో వచ్చిన ధనుష్ చిత్రాలను కూడా డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకులపై వదులుతున్నారు. ఇలా గతంలో చాలామందికి ఎదురైన దుష్పలితాలను చూసిన ధనుష్ ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాడు. ఆయన తాజాగా నటించిన 'అనేగన్' చిత్రం తెలుగులో కూడా 'అనేకుడు'గా రానుంది. ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలకు సిద్ధమవుతుంది. 'రంగం'దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి హరీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. కమల్ హాసన్, విక్రమ్ ల తర్వాత ఆ స్థాయిలో వైవిధ్యం తానే చూపించగలననే విశ్వాసం ధనుష్ లో కనిపిస్తోంది. నటునిగా తనను తాను అద్భుతంగా ప్రెజెంట్ చేసుకునే అవకాశం ఈ చిత్రం ద్వారా వచ్చిందని అంటున్నాడు. ఈ చిత్రంలో ఆయన నాలుగు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను చాలెంజ్ గా తీసుకుని చేశాడని కోలీవుడ్ మీడియా అంటోంది. 'అనేకుడు' కూడా హిట్టయితే ఇక ధనుష్ తెలుగు వారికి మరింత దగ్గరవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.