హీరో రామ్ చరణ్, దర్శకుడు శ్రీను వైట్ల ముందు జరిగిన తప్పునే మరలా చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. శ్రీను వైట్ల తన కిందటి చిత్రం 'ఆగడు' కు విపరీతంగా ఖర్చు పెట్టించి నిర్మాతలకు నష్టాలు మిగిల్చాడు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన నటించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు కూడా నష్టాలు వచ్చాయి. సాధారణంగా రామ్ చరణ్ సినిమా అంటే కమర్షియల్ గా మంచి సక్సెస్ అయితే 40 నుండి 50 కోట్ల వరకు వసూలు చేస్తుంది. ఒక్క 'మగధీర' మాత్రమే అంతకు మించి వసూలు చేసింది. కాబట్టి రామ్ చరణ్ సినిమాకు 40 కోట్ల వరకు బడ్జెట్ ను పెట్టవచ్చు అనేది ట్రేడ్ వర్గాల మాట. కానీ తాజాగా ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించనున్న చిత్రం బడ్జెట్ ప్రీ పొడక్షన్ స్టేజీ లోనే 50 కోట్లు దాటనుందని తెలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు 2.50 కోట్లు, కోన వెంకట్ కు కోటి, గోపీ మోహన్ కు మరో కోటి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హీరో గారి రెమ్యునరేషన్, హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, సినిమా తీయడానికి అయ్యే బడ్జెట్ ఇవన్నీ కలిపితే ఇప్పుడే 50 కోట్ల బడ్జెట్ దాటనుందని తెలుస్తుంది. మరి తెలిసి నిర్మాత దానయ్య తన దానం గుణం చూపిస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.