డెక్కన్ క్రానికల్ సోదరుల కేసు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు తర్వాత మళ్లీ అంత సంచలనాన్ని సృష్టించింది. ఒకే ఆస్తిని పలు బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలపై వారిద్దర్ని సీబీఐ కొన్ని రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వెంకట్రామిరెడ్డి, వినాయక్‌రెడ్డిలు బెయిల్ కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అయితే నిందితులు ఒక్క కెనరా బ్యాంకును మాత్రమే కాకుండా పలు ఇతర బ్యాంకులను కూడా మోసం చేసినట్లు సీబీఐ వాదించింది. డీసీ బ్రదర్స్ చేసిన మోసాల విలువ రూ. 4 వేల కోట్ల వరకు ఉంటుందని వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి మరో డైరెక్టర్ అయ్యర్ పరారీలో ఉన్నారని, ఇప్పుడు డీసీ బ్రదర్స్‌కు బెయిల్ ఇచ్చినా అదే పరిస్థితి పునరావృతమవుతుందని ఆరోపించింది. ఇక డీసీ బ్రదర్స్ తరఫున వాదించిన లాయర్.. వారిద్దరూ గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన వ్యక్తులని, వారు పరారీ అయ్యే అవకాశమే లేదని చెప్పారు.