టాలీవుడ్‌లో స్టార్ హీరో నటించిన సినిమా ప్రెస్‌మీట్ పెట్టాలంటే ఖచ్చితంగా ఏ స్టార్ హోటల్లోనే పెట్టాలి. అంతేకాదు వారి సెక్యూరిటీ కోసం పది మంది బౌన్సర్లు.. అరడజను మంది వ్యక్తిగత సిబ్బంది ఖచ్చితంగా వుండాలి. అయితే ఇందుకు కోలీవుడ్ హీరోలు మినహాయింపుగా చెప్పుకోవాలి. సినిమా ప్రచారం కోసం వాళ్లు మురికివాడల్లో పర్యటించమన్న ఏ మాత్రం సంకోంచించకుండా నడుం బిగిస్తారు. సింగిల్‌గా.. సింపుల్‌గా వస్తారు. ఇక తాజాగా నేడు హైదరాబాద్‌లో కమల్‌హాసన్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ మీడియా సమావేశం జరిగింది. ఈ ప్రెస్‌మీట్‌కు కమల్‌హాసన్ హాజరయ్యాడు. అయితే ఈ సమావేశం ఏ స్టార్ హోటల్లోనో జరిగిందనుకుంటే మీ పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇది జరిగింది హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో.. మినిమమ్ బడ్జెట్ సినిమాల మీడియా సమావేశాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ప్రసాద్‌ల్యాబ్‌లో కమల్‌హాసన్ సినిమా ప్రెస్‌మీట్ జరగడం..దానికి కమల్‌హాసన్ హాజరవ్వడం.. నిజంగా అతని సింప్లిసిటీకి నిదర్శనం. ఎంతైనా ఎదిగిన కొద్ది ఒదిగి వుండటం అనేది కమల్ నుంచి మన స్టార్‌హీరోలు నేర్చుకోవాలి.