‘ఈగ’ చిత్రంతో వారాహి చలనచిత్రం బేనర్‌కు, దాని అధినేత సాయి కొర్రపాటికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బాలకృష్ణతో ‘లెజెండ్’ చిత్రాన్ని ఆయన 14రీల్స్ భాగస్వామ్యంతో తీశాడు. ఈ రెండు చిత్రాలు హిట్టయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాల ద్వారా ఆయనకు లభించిన లాభం తక్కువే అంటున్నారు.ఆ తర్వాత పంపిణీరంగంలోకి అడుగుపెట్టి పెద్ద పెద్ద చిత్రాలను పంపిణీ చేశాడు. అందులో కూడా ఆయనకు నష్టమే వాటిల్లింది. ఇక ‘ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, తుంగభద్ర’ వంటి చిన్న చిత్రాలను నిర్మించాడు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం లాభాలను తెచ్చినప్పటికీ ‘దిక్కులు చూడకు రామయ్యా’ నష్టాలనే మిగిల్చింది. ఇక తాజాగా విడుదలైన ‘తుంగభద్ర’ చిత్రానికి కూడా నెగటివ్ టాక్ వచ్చింది. ఆయన చేస్తున్నవి చిన్న చిత్రాలే అయినా సరైన ప్లానింగ్ లేకుండా చిన్న చిత్రాలకు కూడా విపరీతంగా బడ్జెట్ పెట్టడం ఆయన ప్లానింగ్‌ను దెబ్బతీసింది. ‘తుంగభద్ర’ చిత్రానికి ఆయన దాదాపు 9కోట్ల ఖర్చుపెట్టాడు. బిజినెస్ జరగకపోవడంతో తానే స్వంతంగా రిలీజ్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోలేదంటే పరిస్థితి అర్థమవుతోంది. మొత్తానికి ఆయన సినిమా ఫీల్డ్‌కు వచ్చి పోగొట్టుకున్నదే ఎక్కువని, సంపాదించింది ఏమీ లేదని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి.