అన్ని భారతీయ భాషల్లో 150 చిత్రాలకుపైగా నిర్మించి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడమే కాకుండా అసలైన నిర్మాతకు సిసలైన నిర్వచనం చెప్పిన నిర్మాత మూవీమొఘల్ డా॥ డి.రామానాయుడు. గత నెల 18న అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన డా॥ డి.రామానాయుడు సంస్మరణ సభను నెల రోజుల తర్వాత మార్చి 22న హైదరాబాద్‌లోని పార్క్ హయాత్‌లో టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సంస్మరణ సభకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై డా॥ డి.రామానాయుడుతో తమకు అనుబంధాన్ని, నిర్మాతగా ఆయన సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సభలో డా॥ దాసరి నారాయణరావు, హీరో వెంకటేష్, డి.సురేష్‌బాబు, నాగచైతన్య, రానా, జీవిత, డా॥ రాజశేఖర్, బూరుగపల్లి శివరామకృష్ణ, బ్రహ్మానందం, జయసుద, కె.రాఘవేంద్రరావు, రమేష్ ప్రసాద్, జమున, ఎం.వెంకయ్యనాయుడు, గంటా శ్రీనివాసరావు, శాంతా బయోటెక్ వరప్రసాద్‌రెడ్డి, మురళీమోహన్, డా॥ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.