భారతదేశంలోనే మొట్టమొదటి శాటిలైట్ ఛానెల్ గా అవతరించిన జీ నెట్ వర్క్ శాఖోపశాఖలుగా విస్తరించి ఎన్నో భాషల్లో, ప్రాంతీయ చానెళ్ళను ప్రారంభించి వినోదాన్నందించడంలో ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో పదేళ్ళ క్రితం దక్షిణ భారతదేశంలోకి జీ తెలుగు రూపంలో అడుగుపెట్టింది జీ నెట్ వర్క్. ఇంటింటా వెలుగులు పంచుతూ 13 మిలియన్ల ఇళ్ళకు వినోదాన్నందిస్తోంది జీ తెలుగు. సినీరంగంలో అడుగుపెట్టి తను కూడా పదేళ్ళు పూర్తి చేసుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా, జీ తెలుగుకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అనురాధ(చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్) మాట్లాడుతూ "ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన తమన్నా ప్రయాణం, జీ తెలుగు ప్రయాణం మొదలయ్యి పది సంవత్సరాలు అయింది. నార్త్ నుంచి వచ్చి తెలుగు నేర్చుకొని చక్కగా మాట్లాడగలదు తమన్నా. ఆమెతో జీ తెలుగు కార్యక్రమాలకు సంబంధించిన ప్రమోషన్స్, ప్రోమోస్ చేయించనున్నాం. ఇప్పటివరకు 6 ప్రోమోస్ చేసాం" అని తెలిపారు.
తమన్నా మాట్లాడుతూ "చిన్నప్పటినుండి జీ నెట్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది నేను 'జీ' కి బ్రాండ్ అంబాసిడర్ చేసే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. జీ తెలుగు వారి వర్క్ నాకు చాలా నచ్చింది. ఈరోజుల్లో అందరూ ముఖ్యంగా గృహిణులు టివి లకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. జీ తెలుగు వారు అందించే ఎంటర్ టైన్మెంట్ లో నేను భాగం అవ్వడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ముఖ్యంగా 'జీ' తెలుగు కొత్తదనం ఉన్న కార్యక్రమాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని చెప్పారు.