అతిలోక సుందరి శ్రీదేవి ప్రభాస్ తల్లిగా నటిస్తుందా..? లేదా..? అనే అంశం మీడియాలో చక్కర్లు కొడుతుంది. తల్లిగా నటించడానికి శ్రీదేవి రెండు కోట్లు డిమాండ్ చేసిందని ఆ వార్తల సారాంశం. ఈ వార్తలను చిత్ర బృందం ఖండించింది. నిజానికి 'బాహుబలి' సినిమాలో రాజమాతగా నటించమని శ్రీదేవిని దర్శకుడు రాజమౌళి సంప్రదించారు. శ్రీదేవి ఆసక్తి చూపకపోవడంతో ఆ పాత్ర రమ్యకృష్ణ చెంతకు చేరింది.
'బాహుబలి' తర్వాత సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించే సినిమాలో కూడా ప్రభాస్ తల్లి పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించారు అనే వార్తలలో నిజం లేదని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి సుజీత్ స్క్రిప్ట్ లో తల్లి పాత్రే లేదట. సినిమా ప్రారంభానికి ఇంకా చాలా రోజులు సమయం ఉండడంతో పుకార్లపై దర్శక నిర్మాతలు మౌనం పాటిస్తున్నారు. మౌనం ఒక రకంగా మంచే చేస్తుంది. పైసా ఖర్చు లేకుండా ఫ్రీ పబ్లిసిటీని తీసుకొస్తుంది.