పవన్‌కళ్యాణ్‌తో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను పూరి కించపరిచాడని పెద్ద ఎత్తున దుమారమే రేగింది. ఆ చిత్ర ప్రదర్శనను తెలంగాణలో నిలిపివేయడం... పూరి ఆఫీస్‌ను తెలంగాణవాదులు ముట్టడించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు పూరి తనయుడు ఆకాష్, తండ్రి పూరి తప్పును సరిదిద్దేపనిలో వున్నాడని అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే ఆకాష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రాపోరి’లో ఆకాష్ నిజమాబాద్ నర్సింగ్‌గా తెలంగాణ యువకుడి పాత్రలో వినూత్నంగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం తెలంగాణ యాస నేర్చుకొని మరి డైలాగ్‌లు చెబుతున్నాడట ఆకాష్. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంతో తెలంగాణ ప్రజల ఆక్రోశాన్ని చూసిన పూరి, కొడుకు సాయంతో ఈ చిత్రంతో వారికి కాస్త దగ్గరయ్యే అవకాశం వుందని అంటున్నారు సినీ జనాలు. ఉల్కగుప్తా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై రమేష్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మరాఠీ చిత్రం ‘టైమ్‌పాస్’ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.