విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా ఆయన స్నేహితుడు రమేష్‌అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉత్తమ విలన్’ చిత్రం ఇటీవల వివాదాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ పాటలో హిందువులను కించపరిచేలా, వారి మనోభావాలను దెబ్బతీస్తూ ఉందని పలు హిందూ మత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వీటికి అనుకోని విధంగా ముస్లిం మతసంస్థల నుండి కూడా మద్దతు లభిస్తోంది. కమల్‌హాసన్ ఈమధ్యకాలంలో వార్తల్లో ఉండేందుకు, వివాదాస్పద అంశాలకు తెరతీస్తూ, చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాడని, నిన్న ‘విశ్వరూపం’ చిత్రంలో ముస్లింలను అవమానించిన కమల్, ‘ఉత్తమవిలన్’లో హిందువుల మద్య చిచ్చుపెట్టే విధంగా తీయడం అన్యాయమని మతసంఘాలు వాదిస్తున్నాయి. అయితే కమల్‌హాసన్‌కు తమిళ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. తమిళ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమై ‘ఉత్తమవిలన్’ చిత్రాన్ని విడుదల చేసి తీరుతామని ప్రకటించారు.