దర్శకరత్న దాసరి నారాయణరావు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దాసరి నుండి పవన్ సినిమా ప్రకటన రావడం ఓ సంచలనం అయ్యింది. తర్వాత ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు..? షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు..? ఇలా అభిమానులలో మదిలో తలెత్తిన పలు ప్రశ్నలకు మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. తాజా బర్త్ డే ఇంటర్వ్యూలో వీటిపై దాసరి క్లారిటీ ఇచ్చారు. పవన్ చిత్రానికి దాసరి కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు దర్శకత్వం గురించి ఆలోచించనని చెప్పారు. దాసరి వ్యాఖ్యలు నిజమైతే గబ్బర్ సింగ్ 2 తర్వాత పవన్ చేయబోయే చిత్రం ఇదే అవుతుంది.
ఈ ఏడాది చివరలో పవన్ చిత్రం ప్రారంభమవుతుందని చెప్పారు. ఇంకా దాసరి మాట్లాడుతూ... పవన్, నన్ను దర్శకత్వం వహించమని కోరాడు. ప్రస్తుతం నేను ప్లాపుల్లో ఉన్నాను. నెంబర్ వన్ స్థానంలో ఉన్న పవన్ తో సినిమా తీసి అతని ఇమేజ్ పణంగా పెట్టలేను. సినిమా రిజల్ట్ అటూ ఇటూ అయితే అభిమానులు ఫీలవుతారు. పవన్ స్టైల్, ఎంటర్టైన్మెంట్ పక్కగా ప్రజెంట్ చేసే దర్శకుడైతే బాగుంటుందని నా ఆలోచన. అందుకే, వేరే దర్శకుడితో చేద్దామని చెప్పాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. దర్శకుడిని ఇంకా ఎంపిక చేయలేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాకా ఆలోచిస్తా. అని అన్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ తీయడానికి దాసరి మొగ్గు చూపుతున్నారు, రాజకీయ నేపధ్యంలో చిత్రం తీసే ఉద్దేశం లేదన్నారు. అలాంటి సినిమా అయితే దర్శకత్వం వహించేవాడినని చెప్పారు.