హిట్‌రన్‌అండ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సల్మాన్ కేసు విషయమై బుధవారం ముంబై సెషన్స్ కోర్టు తుదితీర్పు వెలువరించనుంది. ఉదయం 11 గంటలకు కోర్టు కార్యకలాపాలు మొదలైన తర్వాత ఏ సమయంలోనైనా తీర్పు వెలువడవచ్చు. ఈ తీర్పు గురించి అటు బాలీవుడ్‌తోపాటు యావత్‌దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కేసులో సల్మాన్ దోషిగా తేలితే దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో కేసు ఎటువైపు మొగ్గుతుందో తేలని పరిస్థితి నెలకొంది. నిేకసు పూర్వాపరాల్లోకి వెళితే.. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూయిజర్ కారు బాంద్రాలోని ఓ బేకరీ ఎదుట పేవ్‌మెంట్ పడుకున్న వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాద సమయంలో తాను కారు నడిపించలేదని, తన డ్రైవర్ కారు నడిపిస్తున్నాడని సల్మాన్ వాదిస్తున్నాడు. దీన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకిస్తున్నాడు. అయితే ఇటీవలే ఓ సాక్షి తన వాంగ్మూలాన్ని మార్చడం సల్మాన్‌కు కలిసొచ్చే విషయమే. మొదట డ్రైవర్ సీట్లోనుంచి సల్మాన్ దిగుతుండగా తాను చూశానని చెప్పిన సదరు సాక్షి.. మసక చీకట్లో తాను ఆ వ్యక్తిని సరిగ్గా గమనించలేదని ఇప్పుడు తన వాంగ్మూలాన్ని మార్చాడు. ఇక సల్మాన్ ఈ కేసులో దోషిగా తేలితే దాదాపు రూ.300 కోట్ల పెట్టుబడులు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి.