మద్యం మత్తులో కారు నడిపి ఒకరి మృతికి కారణమైన సల్మాన్‌కు ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడే పోలీసులు కోర్టులోనే సల్మాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. అయితే సెషన్స్ కోర్టు జడ్జి తీర్పునకు సంబంధించి పూర్తి తీర్పుపాఠం తమకు ఇవ్వలేదని సల్మాన్ లాయర్లు వాదించి హైకోర్టునుంచి రెండురోజుల బెయిల్ పొందారు. దీంతో అప్పటికప్పుడు జైలుకు వెళ్లాల్సిన సల్మాన్ రెండు రోజులపాటు ఇంటికి వెళ్లే అవకాశం దొరికింది. ఇప్పుడు ఈ రెండు రోజుల్లో కూడా ఓ రోజుకు కోతపడే అవకాశం కనిపిస్తోంది.
మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మృతికి కారణమవడంతోపాటు మరో నలుగుర్ని తీవ్రంగా గాయపర్చిన సల్మాన్‌కు బెయిల్ ఇవ్వడం సబబు కాదని సుప్రీంకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. వెంటనే తాత్కాలిక బెయిల్‌ను రద్దుచేస్తూ సల్మాన్‌ను అరెస్టు చేయాలంటూ ఓ న్యాయవాది స్పెషల్ లీవ్ పిటీషన్‌ను దాఖలు చేశాడు. ఒకవేళ సుప్రీం బెయిల్‌కు వ్యతిరేకంగా తీర్పునిస్తే సల్మాన్ వెంటనే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.