2002లో సల్మాన్ ఖాన్ వల్ల జరిగిన ఓ కారు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. 13 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత ముంబాయి సెషన్స్ కోర్టు సల్మాన్‌కు ఐదేళ్ళ కారాగార శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ సల్మాన్ తరఫు న్యాయవాది హై కోర్టుకు వెళ్ళారు. సెషన్స్ కోర్టు వేసిన శిక్షను సస్పెండ్ చేసి మళ్ళీ ఈ కేసును విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈ కేసును జూన్ 15కు వాయిదా వేసింది. శిక్ష పడినప్పటి నుంచి డల్ అయిపోయిన సల్మాన్‌కు హైకోర్టు నిర్ణయం కాస్త ఊరటను కలిగించింది. ఈ కేసు విచారణ జరుగుతున్నన్ని రోజులూ సల్మాన్ బెయిల్ పైనే ఉంటారని, జైలుకి తరలించాల్సిన అవసరం లేదని కోర్టు ఆదేశించింది. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ అభిమానులు ముంబాయిలో డాన్సులు చేస్తూ, బాణా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇదిలా వుంటే బిజెపితోపాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి విస్తుపోతున్నారు. న్యాయవ్యవస్థలో కూడా ధనిక, పేద వర్గాల తారతమ్యం బాగా వుందని, పేదవాడికి న్యాయం జరగాలంటే చాలా కష్టమని హైకోర్టు నిర్ణయం వల్ల తేలిందని పలువురు బాధపడుతున్నారు.