నిర్మాత సి.కళ్యాణ్ ఎన్నో ఏళ్ల నుండి ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నిర్మాత అయినప్పటికీ ఆయన నిర్మించిన చిత్రాలు ఆయనకు పెద్దగా లాభాలు గానీ పేరును కానీ తీసుకోచ్చినవి వేళ్ల మీద లెక్కించవచ్చు. ‘చందమామ’ సినిమాతో పాటు ఒకటిరెండు డబ్బింగ్ చిత్రాలు మాత్రమే ఆయనకు కొద్దిపాటి పేరును, డబ్బును తీసుకొచ్చాయనేది వాస్తవం. అయితే త్వరలో విడుదలకు సిద్దమవుతోన్న ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం మాత్రం ఆయనకు పేరుతో పాటు మంచి లాభాలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని కొందరు జోస్యం చెబుతున్నారు. అయితే ఈ క్రెడిట్ మొత్తం పూరీజగన్నాథ్‌కే దక్కుతుంది. ఒకే ఒక్క ట్రైలర్‌తో పూరీ అందరినీ తనవైపుకు తిప్పుకున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే ఏదో విషయం ఉంది అని చూచాయగా అందరికీ అర్థమవుతోంది. అంత భరోసా కలగడానికి మరో కారణం కనీసం చార్మి గ్లామరైనా కావాల్సినంత ఉంటుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. సినిమా చూడాలనే ప్రేక్షకులకు కావాల్సిన మసాలా ఫోజులన్నీ కావాల్సినన్ని ఇచ్చింది చార్మి. అదే విషయం బయ్యర్లకు తెగ నచ్చేస్తోంది. ‘జ్యోతిలక్ష్మీ’ ట్రైలర్ బయటకు వచ్చిందో లేదో సి.కళ్యాణ్ ఫోన్ విపరీతంగా రాత్రింబవళ్లు మోగుతూనే ఉంటోందిట. అన్ని ఏరియాల నుండి బయ్యర్లు ఈ సినిమా గురించి ఆరా తీస్తున్నారు. కళ్యాణ్ కూడా మంచి రేటు వస్తే అమ్మేయాలనే చూస్తున్నాడు. ఇలాంటిదే మరో ట్రైలర్‌ను పూరీ దింపాడంటే ‘జ్యోతిలక్ష్మీ’ హాట్ కేకుల్లా అమ్ముడవుతుందనడంలో సందేహం లేదు. మరి అలాంటి రెండో ట్రైలర్‌ను పూరీ ఎప్పుడు వదులుతాడో వేచిచూడాల్సివుంది....!