గజిని, వీడొక్కడే వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకొని తమిళ్‌తోపాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్న సూర్యకి ఈమధ్యకాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేకపోవడంతో ఒక్కసారిగా అతని క్రేజ్ పడిపోయిందని చెప్పాలి. ఎందుకంటే వరసగా ఫ్లాప్ సినిమాలు చేస్తున్నప్పటికీ యూత్‌లో అతనికి క్రేజ్ మాత్రం తగ్గలేదు. అయితే ఈమధ్య వచ్చిన సికిందర్ అతని కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్‌గా చెప్పుకోవాలి. అంతకుముందు ఘటికుడు, బ్రదర్స్, సెవెన్త్ సెన్స్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని నిరాశపరిచిన సూర్య ‘సికిందర్’తో వారికి మరింత దూరమయ్యాడు. లేటెస్ట్‌గా వెంకట్‌ప్రభు డైరెక్షన్‌లో సూర్య చేసిన ‘రాక్షసుడు’పైనే సూర్య ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున నీరాజనాలు అందుకున్నాడు సూర్య. అయితే ఆ నీరాజనాలన్నీ సూర్య కోసం కాదని, ఆ ఆడియో ఫంక్షన్‌కి గెస్ట్‌గా వచ్చిన ప్రభాస్‌కేనని తర్వాత అతనికే అర్థమైంది. ఇప్పుడు ‘రాక్షసుడు’ చిత్రానికి తమిళ్‌లో అంతంత మాత్రంగా వున్న క్రేజ్ తెలుగులో అస్సలు లేదని చెప్పాలి. ఎందుకంటే తమిళ్‌లో, తెలుగులో బిజినెస్‌పరంగా ఎలాంటి ఫాన్సీ ఆఫర్స్ ఈ సినిమాకి దక్కలేదు. సూర్య, వెంకట్‌ప్రభు కాంబినేషన్ ఒక్కటే సినిమాని నిలబెట్టే అవకాశం కనిపిస్తోంది. గతంలో వెంకట్ ప్రభు చేసిన సినిమాలన్నీ కమర్షియల్ బాగా వర్కవుట్ అయిన సినిమాలే. ‘రాక్షసుడు’ సినిమాకి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోవడంవల్ల రిలీజ్ తర్వాత సినిమాకి చాలా హైప్ వస్తుందని సినీవర్గాలు నమ్ముతున్నాయి. తను చేసే ప్రతి సినిమానీ ఒక యజ్ఞంలా భావించి చేసే సూర్య ఈ చిత్రాన్ని అంతకుమించి కష్టపడి చేశాడనీ, తప్పకుండా ఈ సినిమా అతని కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్ అవుతుందని ‘రాక్షసుడు’ యూనిట్ సభ్యులు ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు.