'లింగ' సినిమా రజినీకాంత్‌ను వీడటం లేదు. ఈ సినిమాతో భారీ మొత్తంలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్ కల్పించుకొని తమకు తక్షణమే న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు.
భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అట్టర్‌ప్లాఫ్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే వారు ఆందోళనకు దిగడంతో రూ. 12.5 కోట్లను తిరిగి ఇవ్వడానికి రజినీ అంగీకరించారు. అంతేకాకుండా తక్కువ రెమ్యూనరేషన్‌కు తన తదుపరి సినిమాలో నటించి మిగిలిన మొత్తాన్ని కూడా భర్తీ చేస్తానని రజినీ హామీ ఇచ్చారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళన విరమించారు. అయితే రజినీకాంత్ ఒప్పుకున్న మేర రూ.12.5 కోట్లకు బదులు కేవలం రూ. 5.89 కోట్లు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చారని, మిగిలిన మొత్తాన్ని కూడా అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మరోసారి ఆందోళన చేయడానికి తాము సిద్ధమని ప్రకటించారు. 'లింగా' సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా.. ఆ కష్టాలు మాత్రం ఇంకా రజినీకాంత్‌ను వెన్నాడుతుండటం గమనార్హం.