ఒకపక్క సినిమాలు మరోపక్క రాజకీయాలు, ఇంకోవైపు బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్ వంటి విషయాల్లో యమా బిజీగా ఉన్నప్పటికీ బాలయ్య తన సినిమాల విషయంలో మంచిజోరు మీదనే ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించనున్న 99, 100వ సినిమాలు కన్‌ఫర్మ్ అయ్యాయి. అయితే 100వ చిత్రం తర్వాత సినిమాలపై తన జోరును పక్కనపెడతాడని చాలా మంది భావించారు. కానీ బాలయ్య మాత్రం 100వ చిత్రం తర్వాత కూడా దూసుకుపోవడానికి సిద్దమవుతూ స్టోరీలు వింటున్నాడు. ఇక విషయానికి వస్తే పోలీస్ కథలను వెండితెరపై గ్రిప్పింగ్‌గా, స్క్రీన్‌ప్లే మీద పట్టు అద్బుతంగా కలిగి ఉండే దర్శకునిగా తమిళ డైరెక్టర్ హరికి మంచి పేరుంది. ఆయన తీసిన ‘సింగం, సింగం2’ వంటి చిత్రాలు తమిళంలోనేకాదు.. తెలుగునాట కూడా మంచి విజయం సాధించాయి. అంతేకాదు... ఇవి రీమేక్ అయి బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఉర్రూతలుగించాయి. గతంలో హరి ‘సామీ’ చిత్రంతో కూడా పోలీస్ పవర్‌ను పర్‌ఫెక్ట్‌గా చూపించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో బాలకృష్ణ హీరోగా ‘లక్ష్మీనరసింహ’ పేరుతో రీమేక్ అయి మంచి విజయం సాధించింది. కాగా ప్రస్తుతం తమిళంలో ‘సామీ’ చిత్రానికి సీక్వెల్ తీసే యోచనలో హరి ఉన్నాడట. అందుకు తగ్గ ప్రణాళికలను ఆయన సిద్దం చేసుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో వేర్వేరు హీరోలతో చేయాలని హరి భావిస్తున్నాడని కోలీవుడ్ సమాచారం. తెలుగులో ఈ చిత్రాన్ని బాలయ్యతో చేస్తే సరిగ్గా ఉంటుందని హరి భావిస్తున్నాడట. మొత్తానికి ఈ చిత్రం ఓకే అయితే బాలయ్యను త్వరలోనే పవర్‌ఫుల్ పోలీస్‌గా ఖాకీ డ్రస్సులో చూడటం ఖాయమని విశ్వసనీయ సమాచారం.