రాజమౌళి తీసిన ‘బాహుబలి’ చిత్రాన్ని నైజాం ఏరియాకు గాను భారీ మొత్తానికి దిల్‌రాజు పంపిణీహక్కులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ మోస్తరు స్టార్‌హీరో సినిమాకు అయ్యే బడ్జెట్‌కు సరిసమానమైన మొత్తంతో ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూట్ రైట్స్ తీసుకున్నాడు. దాదాపు 25కోట్లకు పైగా మొత్తాన్ని చెల్లించి ఈ హక్కులను ఆయన పొందాడని సమాచారం. ‘బాహుబలి’ ఎలా ఉన్నా సరే దానికున్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం కేటాయించాడు. అయితే ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. నైజాం మొత్తం దాదాపు 90శాతంకి పైగా థియేటర్లలో ఆయన ‘బాహుబలి’ని విడుదల చేశాడు. ఇక త్వరలో విడుదలకానున్న రవితేజ ‘కిక్2’, గుణశేఖర్ ‘రుద్రమదేవి’ హక్కులను కూడా దిల్‌రాజునే తీసుకున్నాడు. ‘కిక్2’ చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అని మొదట నిర్మాత కళ్యాణ్‌రామ్ భావించాడు. అయితే దిల్‌రాజుకు ఉన్న ఇబ్బంది దృష్ట్యా ఆయన ఈనెల 24న తమ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తుండటంతో దిల్‌రాజుకు థియేటర్లు పెద్ద సమస్యగా మారాయి. ‘బాహుబలి’ని తీసేయలేడు. అలాగని తనే పంపిణీ చేస్తున్న ‘కిక్2’కు థియేటర్లు కేటాయించకుండా ముందుకు పోలేడు. దిల్‌రాజుకు మరోవైపు ‘రుద్రమదేవి’ కూడా ఓ సమస్యగా మారింది. ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలా వరుసగా తన చిత్రాలే తనకు పోటీగా మారుతుండటంతో మింగలేక కక్కలేని పరిస్థితుల్లో దిల్‌రాజు కొట్టుమిట్టాడుతున్నాడు.