ఓ ఐదారు సంవత్సరాల వెనక్కి వెళ్తే టాలీవుడ్‌లో వున్న ప్రముఖ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఎంతో హడావిడి వుండేది. తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్‌లో రిలీజ్ అవ్వాలని లెక్కలు వేసుకొని మరీ కూర్చొనే వారు. వారు ఊహించిన స్థాయిలో థియేటర్లు లేకపోతే హర్ట్ అయిపోయేవారు. ఈ విషయంలో హీరోల అభిమానుల మధ్య డిస్కషన్స్ జరిగేవి. రిలీజ్ తర్వాత 50 రోజులు ఎన్ని థియేటర్లలో వుంటుందనేది మరో సమస్య. ఒక హీరో సినిమా 200 థియేటర్లలో 50 రోజులు నడిస్తే, మరో హీరో సినిమా 250 థియేటర్లలో రన్ అవ్వాల్సిందేనని అభిమానులు పట్టు పట్టేవారు. ఈ విషయంలో దర్శకనిర్మాతల్ని సైతం ఇబ్బందులకు గురి చేసేవారు. 100 రోజులకు కూడా ఇదే పరిస్థితి. ఈమధ్యకాలంలో రిలీజ్ అయ్యే థియేటర్ల గురించి అభిమానుల మధ్య డిస్కషన్ లేదు. లెక్కకు మించిన థియేటర్లలో రిలీజ్ అవుతున్నందున సినిమా 50 రోజులు ఆడిందా, 100 రోజులు ఆడిందా అనే సమస్య అస్సలు లేదు. రెండు మూడు వారాల్లోనే రావాల్సిన కలెక్షన్ అంతా వచ్చేస్తుండడంతో అర్థ శతదినోత్సవాలు, శతదినోత్సవాల గురించి అభిమానులు మర్చిపోయారు. ఈమధ్య కాలంలో అలాంటి వాతావరణం కనిపించనప్పటికీ 'బాహుబలి' ప్రభంజనంతో ఇక ఇప్పట్లో మిగతా హీరోల అభిమానులు థియేటర్ల సంఖ్య విషయంలో, కలెక్షన్ల ఫిగర్స్ విషయంలో కీచులాడుకునే పరిస్థితి రాదనేది అర్థమవుతోంది. ఏ సినిమా ఎన్ని థియేటర్లలో ఆడినా, ఎంత కలెక్ట్ చేసినా ఆ ఫిగర్స్ 'బాహుబలి' దగ్గరకు రాలేవన్నది అందరూ ఒప్పుకునే నిజం.