రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' చిత్రం సంచలన విజయాలు నమోదుచేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరి ఊహకు అందని విధంగా ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 450కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటివరకు ఈ చిత్రం కేవలం దేశీయభాషలైన తెలుగు, తమిళం, మలయాళం, హిందీలలో మాత్రమే విడుదలైంది. తాజాగా ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లోని వివిధ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా చైనీస్ భాషతో పాటు ఇంగ్లీష్ భాషలోకీ అనువదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ చిత్రం మరో 100కోట్లు వసూలు చేయడం గ్యారంటీగా, ఈజీగా కనిపిస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులతో ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ సినిమాల ఎడిటర్ విన్సెంట్ టబైలాన్ను ఎంచుకున్నారు. ఎడిటింగ్ పూర్తయిన తరువాత ఇంటర్నేషనల్ వెర్షన్ విడుదలకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.