హీరోగా వరుస ఫ్లాప్‌లు వచ్చినప్పటికీ ఎట్టకేలకు విజయాలను సొంతం చేసుకొని ముందుకు దూసుకుపోతున్న యంగ్ హీరో నితిన్. ఆయన ప్రస్తుతం హీరోగా నటిస్తూ బిజీగానే ఉన్నాడు. ఆయన సోదరికి ఓ సొంత నిర్మాణ సంస్థ ఉండగా,ఆయన తండ్రికి నైజాంలో పంపిణీసంస్థ ఉంది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోదలిచిన నితిన్ కేవలం తాను నటించే చిత్రాలనే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మించాలని ఆశ పడుతున్నాడు. అందులో భాగంగా అక్కినేని అఖిల్ నటించే డెబ్యూ మూవీని ఆయనే నిర్మిస్తున్నాడు. తాజాగా ఆయన తమిళంలో సూర్య, సమంత, నిత్యామీనన్ జంటగా 'ఇష్క్, మనం' దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '24' అనే చిత్రం తెలుగు అనువాద హక్కులను 20కోట్లు పెట్టి పొందాడు. సూర్యకు ఇటీవల 'సికిందర్, రాక్షసుడు' వంటి ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కేవలం తనకు మంచి పరిచయం ఉన్న దర్శకుడు విక్రమ్‌కుమార్‌పై ఉన్న నమ్మకంతోనే ఆయన ఇంత పెద్దరేటుకు ఆ చిత్రం అనువాద హక్కులను పొందాడు. ఈ చిత్రాన్ని తమిళంలో సూర్య తన సొంత 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తన శ్రేష్ఠ్ మూవీస్, గ్లోబల్ మూవీస్ ద్వారా నితిన్ తెలుగులో విడుదల చేయనున్నాడు.