అదేమిటో గానీ సౌత్‌ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకు ప్రతి సారి ఏదో ఒక వివాదం చుట్టుముడుతోంది. ఆయన సినిమాలనే పనిగట్టుకొని కొందరు వివాదాలు సృష్టిస్తూన్నారు. ఇదంతా ఆయనపై జరుగుతున్న కుట్రగా ఆయన అభిమానులు భావిస్తున్నారు. తాజాగా రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో కళైపులి థాను నిర్మిస్తున్న చిత్రం 'కబాలి'. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. అయితే అనుకోకుండా ఈ చిత్రం టైటిల్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. ఈ చిత్రం టైటిల్ తనదేనని మూడు సంవత్సరాల కిందటే తాను ఈ టైటిల్‌ను రిజిష్టర్ చేశానని, ఈ చిత్రం చాలాభాగం షూటింగ్ కూడా జరుపుకుందని, ఆర్ధికపరిస్థితుల కారణంగా ఇటీవలే ఈ షూటింగ్ ఆగిపోయిందని, తాను మిగతా షూటింగ్ కూడా పూర్తి చేసి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నానని మైసూర్‌కు చెందిన నిర్మాత శివకుమార్ అంటున్నాడు. కానీ రజనీ చిత్రం నిర్మాత కళైపులి థాను మాత్రం తాము ఫిలించాంబర్‌లో రిజిష్టర్ అయిన అన్ని టైటిల్స్‌ను పరిశీలించే ఈ టైటిల్‌ను పెట్టామని, ఇప్పటివరకు ఈ టైటిల్‌ను ఎవ్వరూ రిజిష్టర్ చేయలేదని వాదిస్తున్నాడు. మరి ఈ వివాదం చివరకు ఏ మలుపు తీసుకుంటుందో? ఈ టైటిల్ రజనీకే దక్కుతుందా? లేదా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్‌చేయాలి...!