ఒకప్పుడు హీరో శింబు, నయనతారల మధ్య ఘాటైన ప్రేమాయణం నడిచి, ఆ తర్వాత వారు విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలన్నీ పక్కనపెట్టి మరలా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించడానికి ముందుకు వచ్చారు. ఆ చిత్రమే ఇదు నమ్మ ఆళు. ఈ చిత్రం కారణంగా మరలా శింబు-నయనతారల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ చిత్రం షూటింగ్ కొంత భాగం జరిపిన తర్వాత ఇక ఈ చిత్రంలో నటించే అవకాశం లేదని నయన కుండబద్దలు కొట్టింది. దాంతో వేరే దారి లేక హీరో శింబు ఆమెపై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆమె కోఆపరేట్ చేయకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని శింబు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ ఇక్కడ నయన వాదన మరోలా ఉంది. ఈ చిత్రానికి తాను చాలా డేట్స్ ఇచ్చానని, ఆ డేట్స్ పూర్తయ్యే వరకు సినిమాను సరిగ్గా తీయకుండా తన డేట్స్‌ను వేస్ట్ చేశారని, తాను ఇప్పుడు మరలా ఆ సినిమాకు కాల్షీట్స్ ఇస్తే ప్రస్తుతం తాను తాజాగా చేస్తున్న సినిమా నిర్మాతలకు ఇబ్బందులు ఏర్పడతాయని ఆమె వాదిస్తోంది. మొత్తానికి ఈ గొడవ చివరకు ఏరూపం తీసుకుంటుందో అని తమిళ సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.