సీనియర్ హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆయన్ని వెంటనే హాస్పిటల్ తరలించారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందని, కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్తున్నారు. మాడా అస్వస్థతకు గురయ్యారన్న వార్త బయటికి వచ్చిన వెంటనే మీడియాలో ఆయన చనిపోయారని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతమాత్రం నిజం లేదని, ఆయన క్షేమంగానే వున్నారని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.
ఈ విషయంలో మరోసారి మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాడా మరణించారని కొన్ని న్యూస్ ఛానల్స్‌లో, వెబ్‌సైట్స్‌లో వచ్చేసింది. ఆయన క్షేమంగానే వున్నారని తెలుసుకుని చేసిన తప్పును సరిదిద్దుకున్నారు. హాస్పిటల్ చికిత్స పొందుతున్నవారు చనిపోయారని మీడియా హడావిడి చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో మల్లికార్జునరావు, ఎం.ఎస్.నారాయణ విషయంలో కూడా ఇలాగే జరిగింది. లోకల్ మీడియానే అలా చేస్తుందని మనం ఇన్నాళ్ళూ అనుకునేవాళ్ళం. కానీ, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మీడియా ఇలాగే వుందని ఆమధ్య అర్నాల్డ్ ష్వార్జెనెగర్ విషయంలో కూడా రుజువైంది. అర్నాల్డ్ చనిపోయాడని, దాన్ని కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారని ఇంటర్నేషనల్ ఛానల్స్ ప్రకటించేశాయి. అతను క్షేమంగా వున్నాడని తెలుసుకొని ఆ వార్తను తొలగించారు. మీడియా అత్యుత్సాహం వల్ల హాస్పిటల్‌లో వున్న వ్యక్తి కూడా తన మరణ వార్తను టీవీలో చూసుకునే వీలు కల్పిస్తున్న మీడియా ఇకనైనా మారండి.