సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కూడా మొదలుపెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ సి.వి.యమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ తనయుడు, ఆయన సతీమణి ప్రణతి కూడా పాల్గొనడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఈ ప్రారంభోత్సవం కాస్త రాజకీయ రంగు కూడా పులుముకుంది. గత కొంతకాలంగా చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి దూరంగా వుంటున్న ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రారంభోత్సవానికి తేదేపా తెలంగాణ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మేల్యే నాగం జనార్థన్ రెడ్డిని కూడా ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా వున్న ఎన్టీఆర్ మళ్లీ తెలుగుదేశానికి దగ్గరయ్యే ఆలోచన చేస్తున్నాడా.. చంద్రబాబును మెప్పించాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? ఒకవేళ తీసుకున్న కేవలం తెలంగాణ తేదేపా నాయకులనే ఎందుకు ఆహ్వానించినట్లు..? అనే ఆసక్తికరమైన చర్చలు ఇప్పుడు టాలీవుడ్‌లో జరుగుతున్నాయి.