రచ్చ సినిమాతో మాస్ పల్సు సరిగ్గా తెలిసిన అతికొద్ది మంది అగ్రదర్శకుల జాబితాలో సంపత్ నంది ఎంచక్కా చేరిపోయాడు. తదుపరి చిత్రం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసినా ఎట్టకేలకు పవర్ ఫుల్ బెంగాల్ టైగర్ సినిమాతో రవితేజను సరికొత్త కోణంలో ఈ నెలాఖరు నుండి ప్రదర్శించేందుకు సర్వం సిద్ధం చేసేస్తున్నాడు. రవితేజ అంటేనే ఎనర్జీ అన్నది పాత విషయమే. కానీ ఆ ఎనర్జీని ఎలా వాడేసుకోవాలో తెలిసినోల్లకే సూపర్ హిట్లు దక్కాయి. బెంగాల్ టైగర్ మొదలైన దగ్గరి నుండి ఇప్పుడు రిలీజు వరకు అంతటా ఈ పాజిటివ్ ఎనర్జీని కనిపిస్తుండడం చెప్పుకోదగ్గ విషయం.
ఇక సంపత్ నంది ఎంతలా మాస్ మహారాజాను, హీరోయిన్లను వాడుకున్నాడో తెలియాలంటే రాయే రాయే సాంగు ఒక్కటి చాలేమో అనిపిస్తుంది. భీమ్స్ అందించిన మాస్ బీటుకు, రవితేజతో కలిసి తమన్నా, రాశి ఖన్నాలు దుమ్ము దులిపారని సాంగ్ ట్రైలర్ చూస్తే వీజీగా అర్థమవుతుంది. అయితే కేవలం వీళ్ళ అందాలను ఎడాపెడా ఆరబోయడం ఒక్కటే చేస్తే అగ్లీగా ఉండేది కానీ సాహిత్యానికి తగ్గట్టుగా రాశి ఖన్నా సోయగాల బొంగరాలను గిర్రగిర్ర తిప్పించిన తీరు, ఆగలేక తమన్నా కాలు సర్రసర్ర జారిన తీరు సంపత్ నందిలోని కళాపుష్టికి మచ్చు తునకలు. ఫైనలుగా మిల్క్ అండ్ రాశిలు పోటీపడుతూ రవితేజ మీదెక్కి సవారి చేయడం చూస్తుంటే... బాబోయ్ ఇది మాస్ కాదు ఊర మాస్ అని తీరాల్సిందే. ఇక బెంగాల్ టైగర్ మిగిలిన ముద్దు ముచ్చట్లు నెలాఖరుకి తెర మీద వేడివేడిగా వడ్డిస్తారుగా, అప్పుడు ఆరగిద్దాం.