తేజ దర్శకత్వంలో రూపొందిన జై చిత్రంతో హీరోగా పరిచయమైన నవదీప్ తెలుగు, తమిళ్‌లో కలిపి ఇప్పటివరకు దాదాపు 40 సినిమాల వరకు చేసినా అందులో హీరోగా అతనికి పేరు తెచ్చినవి ఒకటి, రెండు సినిమాలే. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేసినా వాటికి వచ్చిన గుర్తింపు కూడా అంతంత మాత్రమే. దీంతో సౌత్‌లో ఇక లాభం లేదనుకున్నాడో ఏమో ఇప్పుడు బాలీవుడ్ ప్రయాణమవుతున్నాడు నవదీప్. తన అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకోవాలని డిసైడ్ అయ్యాడట.
అంతర్జాతీయ క్రికెటర్ అజహరుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా అజహర్ పేరుతో బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అజహర్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న ఈ చిత్రంలో ప్రాచి దేశాయ్, నర్గీస్ ఫక్రీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజహర్‌తోపాటు రవిశాస్త్రి, అజయ్‌జడేజా, జ్వాలా గుత్తా, అనిల్ కుంబ్లే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ వంటి క్యారెక్టర్స్‌లో ఇతర నటీనటులు కనిపిస్తారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవదీప్‌ని ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు తెలిసింది. తను లుక్‌వైజ్ బాలీవుడ్ హీరోలా వుంటానని నవదీప్ నమ్మకం. అదే కాన్ఫిడెన్స్‌తో అజహర్ సినిమాలో వచ్చిన ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడు నవదీప్. టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో రాని బ్రేక్ బాలీవుడ్‌లో అయినా నవదీప్‌కి వస్తుందేమో చూద్దాం.