ఎ.యం.రత్నం.. ఈ నిర్మాత పేరు వింటే ఎవరైనా సూపర్ అనాల్సిందే. ఈయనకు సినిమాలపై ఉన్న నిబద్దత, ఆయనకున్న అవగాహన, ఆయన తీసే చిత్రం అంటే ఎవరైనా సరే సూపర్‌హిట్ కింద లెక్కవేస్తారు. ఇప్పుడు అందరూ గోల్డెన్ హ్యాండ్‌గా చెప్పుకొనే దిల్‌రాజు కంటే ఈయనకు ఉన్న జడ్జిమెంట్ మరింత గొప్పది. ఇలాంటి నిర్మాత తన పుత్రులను సినిమా ఫీల్డ్‌లో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేసి చివరకు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులో పడ్డాడు. ఒక్కసారిగా రెండు మూడు ఫ్లాప్‌లు వచ్చేసరికి టాలీవుడ్‌లోని హీరోలందరూ ఆయనకు మొహం చాటేశారు. అయితే తన మీద తనకున్న నమ్మకంతో ఆయన ప్రస్తుతం తమిళంలో అజిత్ చేయూతతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకుంటున్నాడు. 'ఆరంభం' పెద్దగా లాభాలు తీసుకొని రాకపోయినా ఆ తర్వాత వచ్చిన 'ఎన్నై అరిందాల్, వేదలమ్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఎ.యం.రత్నం మనసెరిగిన అజిత్ వంటి స్టార్ రత్నం విషయంలో ఆయనకు అన్నింటా చేదోడు వాదోడుగా నిలుస్తూ... ఆర్థిక సమస్యల్లో ఉన్న రత్నంకు వరుస సినిమాలు చేస్తూ ఆయనకు పూర్వవైభవం సిద్దించేలా కృష్టి చేస్తున్నాడు. మొత్తానికి రాబోయే మరో రెండు చిత్రాలను కూడా అజిత్ రత్నంకే చేయనున్నట్లు కోలీవుడ్ సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఆయన తెలుగులోకి కూడా రీఎంట్రీ ఇచ్చి తనకు మొహం చాటేసిన హీరోలు, దర్శకులకే తగిన గుణపాఠం చెప్పాలనే కసితో ఉన్నట్లు తెలుస్తోంది.