శృతిహాసన్ రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. కెరీర్ మొదట్లో హిట్లు లేక ఇచ్చినంత పారితోషికం తీసుకుని సినిమాలు చేసిన శృతి కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వరుసగా విజయాలు తన ఖాతాలో వేసుకొంది. టాలీవుడ్‌లో ఆమె నటించిన 'శ్రీమంతుడు' భారీ విజయం సాధించడంతో పాటు అటు తమిళంలో అజిత్‌తో ఆమె చేసిన 'వేదలమ్' కూడా సూపర్‌హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఆమెకు తమిళంలో హిట్ల సంఖ్య ఏమీలేదు. అయితే టాలీవుడ్‌లో మాత్రం ఆమె ఖాతాలో చాలా హిట్స్ ఉన్నాయి. దీంతో తమిళంలో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ బ్యూటీ తెలుగులో మాత్రం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఒక్కో సినిమాకు ఆమె ఏకంగా కోటిన్నర డిమాండ్ చేస్తోంది. ఫామ్‌లో ఉన్న హీరోయిన్ కావడంతో నిర్మాతలు కూడా ఆమె డిమాండ్‌కు తలొగ్గి అడిగినంత ముట్టచెబుతున్నారు. తాజాగా ఆమె నాగచైతన్య నటిస్తున్న 'ప్రేమమ్' రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో రామ్‌చరణ్ నటించబోయే 'తని ఒరువన్' రీమేక్‌తో పాటు ఎన్టీఆర్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో చేస్తున్న చిత్రాలలో నటించమని ఆమెకు ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ రెండు చిత్రాలను ఆమె ఇంకా ఫైనలైజ్ చేయలేదని టాక్.