నితిన్ హీరోగా, సమంతా హీరోయినుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అఆ సినిమాలో మరో హీరోయిన్ యాడ్ అయింది. ఇది హీరో పక్కన హీరోయిన్ పాత్ర కాకపోయినా ఇంతకుమునుపు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ వేషాలు దక్కించుకున్న తమిళ పొన్ను అనన్య హీరో నితిన్ చెల్లెలి పాత్రకు ఒప్పుకుంది. ఎంగేయుం ఎప్పోడుం తమిళ చిత్రం, అదే తెలుగులో జర్నీగా హిట్టవడంతో అనన్యకు తెలుగునాట మంచి గుర్తింపు లభించింది. అటు తరువాత రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఇంటింటా అన్నమయ్యలో హీరోయిన్ రోల్ చేసినా ఆ సినిమా విడుదలకు నోచుకోకపోవడంతో అనన్య క్రమంగా తెలుగు సినిమాల నుండి మాయమయింది. ఆ మధ్యలో కృష్ణుడు హీరోగా వచ్చిన అమాయకుడులో ముఖ్య భూమిక పోషించినా దానితో పెద్దగా గుర్తింపు దొరకలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మేటి దర్శకుడు అడగడంతో కాదనలేక అనన్య ఈ పాత్రకు ఒప్పుకుందట. మరి అఆతో తెలుగు సినిమా పరిశ్రమకి ఓ కొత్త అక్క, చెల్లి ఆర్టిస్టు దొరికినట్టు అనుకోవచ్చు.