ఒక సినిమా సూపర్‌హిట్ అవ్వాలంటే దానికి మార్గం ఒక్కటే. ఆ సినిమా బాగుండి తీరాలి. ఇందులో కొత్త విషయం ఏముంది అనుకోవచ్చు. కానీ, తాము చేసిన సినిమా బాగా లేదని, ఖచ్ఛితంగా జనానికి నచ్చదు అని తెలిసినా దాన్ని సూపర్‌హిట్ చేసేందుకు మన దర్శకనిర్మాతలు నానా కష్టాలు పడుతుంటారు. ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్ గుప్పిస్తారు, అన్ని ఛానల్స్‌లోని షోలలో యూనిట్ సభ్యులు పార్టిసిపేట్ చేస్తారు. ఆ సినిమా రిలీజ్‌కి ముందు, రిలీజ్ తర్వాత ఏ ఛానల్‌లో చూసినా ఆ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు లేదా దర్శకనిర్మాతలే దర్శనమిస్తుంటారు. ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటూ వుంటారు. కొంతమంది మరింత రెచ్చిపోయి కంటతడి కూడా పెట్టుకుంటారు. ఆ ఇంటర్వ్యూలు చూసే ప్రేక్షకులకు సినిమాలో ఏదో వుంది అనే భావన కలిగిస్తారు. దానివల్ల కొంత శాతం ఆడియన్స్ థియేటర్స్‌కి వచ్చినా వారికి లాభమే కదా.
తమ సినిమా సూపర్‌హిట్ చేసుకోవడానికి కొంతమంది మరి కొన్ని మార్గాలు ఎంచుకుంటారు. అవి స్కీమ్‌లు, కాంటెస్ట్‌లు. ఇది చాలా పాత పద్ధతి. ఒకప్పుడు కొత్త హీరో, హీరోయిన్‌తో వై.వి.యస్.చౌదరిని దర్శకుడుగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రానికి 1 కేజీ బంగారం స్కీమ్‌ని పెట్టారు. ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. గెలుపొందిన ముగ్గురు విజేతలకు కేజీ బంగారాన్ని సమానంగా పంచారు. రెండో బహమతిగా 5 కేజీల వెండిని ఒకే విజేతకు అందించారు. అయితే కేవలం బంగారం స్కీమ్ పెట్టడం వల్ల ఆ సినిమా హిట్ అవ్వలేదనేది అందరూ గ్రహించాలి. విషయం వుంది కాబట్టే ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. సినిమాలో విషయం వుంటే జనాన్ని స్కీమ్ పేరుతో థియేటర్‌కి బలవంతంగా రప్పించాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఆ సినిమా ఒక ఉదాహరణ.
అయితే ప్రస్తుత పరిస్థితులు వేరు. ఒక సినిమాకి ఇలాంటి స్కీమ్‌గానీ, కాంటెస్ట్‌గానీ పెట్టారంటే సినిమాలో విషయం లేదు అని జనం ఇట్టే గ్రహించేస్తున్నారు. అంతకుముందు సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ వున్నవారు కూడా స్కీమ్ పెట్టారని తెలిసిన తర్వాత థియేటర్‌కి రావాలంటే భయపడుతున్నారు. ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసే అలాంటి స్కీమ్‌ల వల్ల, కాంటెస్ట్‌ల వల్ల సినిమాలు సూపర్‌హిట్ అవ్వవని దర్శకనిర్మాతలు గ్రహించాలి. సినిమా బాగుంటే ఎలాంటి పబ్లిసిటీ చెయ్యక్కర్లేదని, ఎలాంటి స్కీమ్‌లు పెట్టక్కర్లేదని, కేవలం మౌత్‌టాక్ చాలని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. సినిమాని ప్రమోట్ చేయడంలో చూపించే శ్రద్ధ సబ్జెక్ట్ విషయంలో, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంపిక, మేకింగ్ విషయాల్లో చూపిస్తే ప్రతి నిర్మాత సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించే అవకాశం వుంటుంది. ఈ ఓపెన్ సీక్రెట్ మన దర్శకనిర్మాతలు ఎప్పుడు తెలుసుకుంటారో!