కమెడియన్ నుండి హీరోగా అవతారం ఎత్తిన సునీల్ ఆ తర్వాత ఒక్కసారిగా సిక్స్‌ప్యాక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా 'అందాలరాముడు' నుండి 'భీమవరం బుల్లోడు' వరకు సునీల్ నటించిన చిత్రాలన్నీ కామెడీ ప్రధానంగా సాగే చిత్రాలే కావడం తెలిసిందే. 'తడాఖా' చిత్రంలో తన మార్క్ యాక్షన్‌ను కూడా మిక్స్ చేసిన సునీల్ తాజాగా తనకు ఇప్పుడు కామెడీ చిత్రాలు కాదు... తనకు మాస్‌ను దగ్గరకు చేసే కథలతో రావాలని నిర్మాత దర్శకులకు షరత్తు విధిస్తున్నాడట. కామెడీని కాదని, మాస్ అండ్ యాక్షన్ సినిమాల కోవలోనే ఆయన తాజాగా నటించిన 'కృష్ణాష్టమి' చేరుతుందని టాక్. వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న 'కృష్ణాష్టమి' చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్ మూవీ అని, ఇందులో ఆయన లుక్ కూడా గడ్డంతో అట్రాక్టివ్‌గా ఉందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన వంశీకృష్ణ ఆకేళ్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇటీవల 100మంది బాడీ బిల్డర్స్ సమక్షంలో చిత్రీకరించారని, ఈ యాక్షన్ ఎపిసోడ్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వం వహించగా, వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకొంది. సో... సునీల్ ఇప్పుడు మాస్ జపం చేస్తూ.. యాక్షన్ ట్రీట్ ఇచ్చి మాస్ హీరోగా మారాలని అటువైపు అడుగులు వేస్తున్నాడు. మరి ఈ కోరిక సునీల్‌కు ప్లస్ అవుతుందో లేక పామై కాటేస్తుందో వేచిచూడాల్సివుంది...!