తమిళనాడులో మరీ ముఖ్యంగా చెన్నైలో వచ్చిన వరదల కారణంగా తీవ్ర ప్రాణనష్టం, ఆస్థి నష్టం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ వరదల వల్ల కోలీవుడ్‌కు కోట్లకు కోట్లు నష్టం వచ్చి వర్షార్పణం అవుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎక్కడి షూటింగ్‌లు అక్కడ ఆగిపోయాయి. స్టూడియోలు కూడా నీటిలో మునిగిపోయాయి. షూటింగ్‌లు ఎక్కడివక్కడ బంద్ అయ్యాయి. ఇక కొత్త ఓపెనింగ్స్ వాయిదాలు పడ్డాయి. మరో నెల రోజుల వరకు కొత్త సినిమాలు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఆల్‌రెడీ రీసెంట్‌గా దీపావళికి విడుదలైన అజిత్ 'వేదలమ్', కమల్‌హాసన్ 'తూంగావనం' చిత్రాలు తీవ్రంగా నష్టపోయాయి. దాదాపు 10రోజులుగా అక్కడ థియేటర్లు మూత పడ్డాయి. 'వేదలమ్' చిత్రం బ్లాక్‌బస్టర్ అయిన మొదటి నాలుగురోజుల్లోనే 50కోట్ల వసూళ్లని సాధించింది. కానీ ఈ మధ్య వరసగా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ చిత్రం రెండు వారాల్లో కేవలం 70కోట్ల వద్దకుచేరి బిజినెస్ క్లోజ్ అయింది. ఇక కమల్‌హాసన్ 'తూంగావనం' సంగతి మరింత వేరుగా ఉంది. అసలే ఓపెనింగ్స్ కూడా సరైన స్థాయిలో లేని ఈ చిత్రం వర్షాల వల్ల మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారింది. మొత్తానికి ఈ వరదలు, వర్షాల కారణంగా కోలీవుడ్ అతలాకుతం అయి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.