గ్లామర్ పాత్రల్లో ఎంతలా రాణించి స్టార్ నటీమణిగా పేరు పొందినా, రిటైర్ అయిన తరువాత మనకు మనం గొప్పగా ఫీలయ్యే ఒక్కటంటే కనీసం ఒక్క సినిమా ఉన్నా జీవితానికి సరిపోతుంది అంటోంది హీరోయిన్ సమంతా. నిజానికైతే సమంతాను ఇప్పటి దాకా మనం హీరో సెంట్రిక్ సినిమాల్లో కేవలం గ్లామర్ ఒలకబోసే చిత్రాలలో ఎక్కువగా చూసాము. వీలైనంతలో సమంతా కూడా తన నటనతో ప్రేక్షకుల్ని బాగానే అలరించింది. కానీ మొన్నటిదాకా కమర్షియల్ సినిమాలకు పరిమితమైన సమంతా ఇప్పుడిప్పుడే మనం లాంటి వినూత్నమైన చిత్రాల ద్వారా సరికొత్త పాత్రలతో విజయాల్ని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఆ కోవలోనే తనకు పీరియాడిక్, సోషియో ఫ్యాంటసీ కథల్లో నటించాలని ఉందని, అటువంటి అవకాశం కోసం చాన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నానని అంటోంది. అలాంటి చిత్రాల్లో గనక అవకాశం దొరికితే తనలోని ప్రతిభను పరిపూర్ణంగా ఆవిష్కరించుకునే ఆస్కారం దొరుకుతుందని కూడా చెబుతోంది. ఇప్పటికైతే తెలుగు భాషలో పీరియాడిక్ సినిమాలు తీయాలంటే రాజమౌళి పేరే ప్రప్రథమంగా వినబడుతుంది. ఎలాగూ జక్కన్నతో ఈగలో చేసిన అనుభవం సమంతాకు ఉండనే ఉంది. ఈవిడగారి కోరికను విన్నారంటే రాజమౌళి గారు తప్పకుండా తాను తీయబోయే మహాభారతంలోనో, రామాయణంలోనో ఇంత స్థానం ఇవ్వకపోతారా?