నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా అంటే చాలు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. సినిమా ఎలా ఉంది? అనే విషయాన్ని కూడా పక్కనపెట్టి ఆయన చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అందులోనూ బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా ఎక్కువ. ఈ పండగకు రిలీజైన ఆయన చిత్రాలలో అత్యదికం చరిత్రను తిరగరాశాయి. ఇక నందమూరి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అంటే గ్రేట్ ఓపెనర్. ఆయన చిత్రాలకు కూడా హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా జనం పోటెత్తుతారు. ఇక పండగ సెలవుకు వస్తోందని తెలిస్తే ఇక కనీసం వారం రోజులు థియేటర్ల ముందు జనాలు క్యూ కడతారు. వారికున్న ఇమేజ్ మరీ ముఖ్యంగా మాస్‌లో వారికున్న స్టామినా అటువంటివి. అంతేకాదు.. తాజాగా బాలయ్య నటిస్తున్న 'డిక్టేటర్'తో పాటు ఎన్టీఆర్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి వీరిద్దరితో పాటు ఈ సంక్రాంతికి నాగార్జున సైతం తన 'సోగ్గాడే చిన్నినాయన'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సై అంటున్నాడు. ఇప్పటివరకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' చిత్రం జనవరి 13న, బాలయ్య 'డిక్టేటర్' జనవరి 14న రానుండగా, నాగ్ నటిస్తోన్న 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రం జనవరి 15న విడుదలకానుందని తెలుస్తోంది. వాస్తవానికి నాగ్ పెద్ద ఓపెనర్ ఏమీ కాదు. సినిమా హిట్టు టాక్ వస్తేనే అది కూడా మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన చిత్రాలకు వస్తారు. కానీ బాలయ్య, ఎన్టీఆర్‌లతో పోల్చుకుంటే నాగార్జునకు పెద్ద ఓపెనింగ్స్ రావనే అపవాదు ఉంది. మరి నందమూరి హీరోల మద్య నాగ్ వస్తే నలిగిపోతాడేమో అని అక్కినేని అభిమానుల భయం.