నందమూరి బాలకృష్ణ 99వ చిత్రంగా విపరీతమైన పబ్లిసిటీకి నోచుకుంటున్న డిక్టేటర్ ఎట్టకేలకు నిన్న పాటల పండగను పూర్తి చేసుకుంది. అదే అదునులో దర్శకుడు శ్రీవాస్ గారు కొత్త ట్రైలర్ కూడా వదిలి అభిమానుల్లో ఎనలేని సంబరాన్ని నింపారు. ట్రైలర్ గమనిస్తే డిక్టేటర్ పక్కాగా బాలకృష్ణ పంథాలో సాగే రెగ్యులర్ కమర్షియల్ చిత్రం చాయలతో పాటుగా కోన వెంకట్, గోపి మోహన్ ట్రేడ్ మార్క్ ట్రీట్మెంట్ కూడా కనపడుతోంది. దూకుడు, లౌక్యం చిత్రాలలో వాడిన కొన్ని ఎపిసోడ్స్ కేవలం నేపధ్యం మార్చి మళ్ళీ ప్రెజెంట్ చేసినట్టుగా అనిపిస్తున్నా దర్శకుడు శ్రీవాస్ అండ్ టీం తప్పకుండా ఎటువంటి ఎక్స్ పరిమెంటులకు వెళ్ళకుండా ప్రేక్షకులకు 100 పర్సెంట్ వినోదం ఇవ్వడానికే మొగ్గు చూపినట్టు అనిపిస్తోంది. రత్నం, శ్రీధర్ సీపానల తమ పెన్నుల యొక్క పదునును బాలయ్య మీద పూర్తిగా వాడినట్టున్నారు. సినిమాలో సరైన సందర్భంలో గనక ఈ డైలాగులు పేలితే డిక్టేటర్ రేంజు ఎక్కడికో వెళ్ళిపోవడం ఖాయం. ఓవరాలుగా కొత్తదనం ఆశించడం అటుంచి బాలయ్యను పక్కా మాస్ మసాలా పవర్ ఫుల్ పాత్రలో చూడాలని అనుకుంటే మాత్రం పాత చింతకాయ పచ్చడే అయినా నట సింహం చేసారు గనక డిక్టేటర్లో కొత్త రుచి తగలాల్సిందే. ఈ రుచులను ఆస్వాదించాలంటే సంక్రాంతి దాకా వెయిట్ చేయాల్సిందే.