అక్కినేని కుటుంబ కథానాయకుల్లో ఏఎన్నార్ నుంచి నాగచైతన్య వరకు అందరికీ మన్మథుడు అనే ట్యాగ్‌లైన్‌ని తగిలించేశారు తెలుగు ప్రేక్షకులు. ఆ కథానాయకులు తెరపై రొమాంటిక్ సన్నివేశాల్లో అంతగా రెచ్చిపోయారు మరి. కానీ ఇటీవలే తెరపైకొచ్చిన అఖిల్ మాత్రం ఆ విషయంలో కాస్త వెనకబడ్డాడని అనిపించింది. తొలుత అందరికీ క్లాస్ హీరోలుగానే గుర్తింపొచ్చింది కాబట్టి అఖిల్‌కైనా మాస్ కథానాయకుడిగా గుర్తింపు రావాలని..ఏరికోరి ఓ మాస్ కథని ఎంపిక చేశాడు నాగార్జున. ఆ కథకి అఖిల్ బాగానే న్యాయం చేశాడు కానీ... రొమాన్స్ విషయంలోనే కాస్త లోటు చేశాడేమో అనిపిస్తుంది. అదే విషయాన్ని అఖిల్‌లో కథానాయికగా నటించిన సయేషా కూడా మీడియాతో చెప్పుకొచ్చింది.
అఖిల్ ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణమేమిటని సయేషాని అడిగితే... రొమాన్సే అని చెప్పింది. ప్రస్తుతం హిందీలో అజయ్‌దేవగణ్‌తో కలిసి శివమ్‌లో నటిస్తున్న సయేషా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. నేటితరం ప్రేక్షకులు థియేటర్లకి రావాలంటే రొమాన్స్ చాలా ముఖ్యం. కానీ అఖిల్ సినిమాలో మాత్రం ప్రాపర్ రొమాన్స్ సీన్లే లేవు. ఆమాటకొస్తే నాకు,అఖిల్‌కి మధ్య బలమైన సన్నివేశాలే లేవు. కేవలం పాటల్లో మాత్రమే కలుస్తుంటాం. అందుకే ఆ సినిమా అలాంటి ఫలితాన్ని తీసుకొచ్చింది. అయినా నేనేం బాధపడటం లేదు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌లు, ఫెయిల్యూర్లు మామూలే. చిన్నప్పట్నుంచి ఇదే పరిశ్రమలో ఉన్నాను. అందుకే మరింత ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకొని కొత్త సినిమాల్లో నటిస్తున్నా అని చెప్పుకొచ్చింది సయేషా.