నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ అండ్ ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల ప్రచారం పనులు విపరీతమైన వేగం పుంజుకున్నాయి. అన్ని చిత్రాల అసలు ఫలితం తేలడానికి మరో 48 గంటలు కూడా లేకపోవడంతో ఎవరు గీసుకున్న స్కెచ్ ప్రకారం వారు ముందుకు సాగిపోతున్నారు. తీక్షణంగా గమనిస్తే ఈ ప్రమోషన్ కార్యాల్లో వెనకపడినట్టుగా కనిపిస్తున్న ఒకే ఒక్క మూవీ సోగ్గాడే చిన్ని నాయన. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టు మీద అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. బట్ పండగ పోటీ విపరీతంగా ఉండడంతో హీరోలు ఎన్టీయార్, బాలకృష్ణ, శర్వానంద్ ముందు నిలబడి తమ తమ సినిమాలను ప్రేక్షకులకు అతిదగ్గరిగా తీసుకెళ్ళడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్, ఆడియో వేడుక తరువాత నాగార్జున గారు ముందుకు వచ్చి నడిపించాల్సిన ఈ ముఖ్యమైన సమయంలో సోగ్గాన్ని వెనక వేయటం ఏంటబ్బా అని అక్కినేని అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. సినిమా ఎంత గొప్పగా ఉన్నా, ప్రమోషన్స్ అనేవి ఎంత కీలకమో అక్కినేని వారికి తెలియనిది కాదు. ఆఖరి నిమిషంలో మీరు ఇంత సైలెంటుగా ఉంటె ఏమీ బాలేదు నాగార్జున గారు!