కింగ్ నాగార్జున నటించిన నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం ఈ రోజు(జనవరి 15) విడుదలైంది. ఇక సమ్మర్‌లో ఆయన కార్తీ, తమన్నాలతో కలిసి చేస్తున్న 'ఊపిరి' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో నాగ్ వీల్‌చైర్‌కే పరిమితమయ్యే పాత్రను పోషిస్తున్నాడు. కాగా ఈ రెండు చిత్రాల తర్వాత నాగ్ మరో కొత్త చిత్రానికి ఇప్పటివరకు లైన్‌లో పెట్టలేదు. ఈ చిత్రాల తర్వాత ఆయన చాలా లాంగ్ గ్యాప్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తన కెరీర్ చరమాంకంలోకి చేరిన విషయాన్ని నాగ్ ఒప్పుకున్నాడు కూడా. తనకు తన కొడుకులైన నాగచైతన్య, అఖిల్‌ల కెరీరే ముఖ్యమని, వారిద్దరికీ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చే వరకు తన దృష్టి మొత్తం వారు చేయబోయే చిత్రాలపైనే ఉంటుందని, అందుకే తాను లాంగ్ గ్యాప్ తీసుకోనున్నట్లు స్వయంగా ప్రకటించాడు నాగ్. ఇప్పుడు తన కెరీర్ కంటే తన కొడుకుల కెరీరే తనకు ముఖ్యమని ఆయన తేల్చేశాడు. దీంతో ఇక నాగ్ చాలాకాలం పాటు మరో కొత్త చిత్రంలో నటించే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. మరి తండ్రిగా ఆయన తన బాధ్యతల విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు? దానికి ఎంతకాలం పట్టనుంది? అనే విషయాలు భవిష్యత్తులో కానీ తేలవు.