దిల్‌రాజు ఎడిటింగ్ టేబుల్ దగ్గర చాలా నికార్సుగా ఉండే మనిషి. ప్రేక్షకుల పల్స్ బాగా తెలిసిన ప్రొడ్యూసర్. ఏ సినిమాకి ఎంత లెంగ్త్ అవసరమో... బాగా లెక్కకడతాడు. నిజానికి స్క్రిప్ట్ దశలోనే కటింగులు చేస్తాడు. అయితే 'కృష్ణాష్టమి' విషయంలో మాత్రం ఆ దశ చేయిదాటిపోయింది. అందుకే ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఈ సినిమాకి బాగా కత్తెర వేశాడు. దాదాపు అరగంట సినిమాని లేపేశాడట. ఈ విషయాన్ని స్వయంగా దిల్‌రాజే చెప్పుకొచ్చాడు. సినిమా పూర్తయిన వెంటనే అందరికీ చూపించి.. అభిప్రాయాలు సేకరించిన దిల్‌రాజు వాళ్లందరి అభిప్రాయాల మేరకు లెంగ్త్‌ను తగ్గించాడట. ఆఖరికి డబ్బింగ్ థియేటర్ మేనేజర్ చెప్పిన సలహాలు కూడా తూచా తప్పకుండా పాటించాడట. ఇప్పుడు 'కృష్ణాష్టమి' రన్‌టైమ్ కేవలం 2గంటల 15 నిమిషాలు మాత్రమే అని సమాచారం. ఇక ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న మాట ఏమిటంటే... కొన్ని సినిమాలకు వద్దన్నా కూడా హిట్ కళ వచ్చేస్తుంది. ఆ సినిమాలో ఏదో విషయం ఉండే ఉంటుందన్న ఫీలింగ్ పోస్టర్స్ చూస్తేనే తెలిసిపోతుంది. అందుకే దిల్‌రాజు తన సినిమాల విషయంలో చాలా కేర్‌గా ఉంటాడు. ట్రైలర్, పోస్టర్, ప్రచార చిత్రాలు, పబ్లిసిటీ విషయాల్లో వినూత్న ఆలోచనలతో వస్తుంటాడు. అయితే ... 'కృష్ణాష్టమి' విషయంలో దిల్‌రాజు ఎత్తుగడ చాలా నార్మల్‌గా ఉంది. ట్రైలర్ చూస్తే సినిమా చూడాలన్న కుతూహలం కనిపించడం లేదు. సినిమా ఆలస్యం కావడం, సునీల్ ఫామ్‌లో లేకపోవడం, సునీల్ తప్ప ఈ సినిమాలో తెలిసిన మొహాలు కనిపించకపోవడం, పబ్లిసిటీ మరీ డల్‌గా కనిపిస్తోంది. దానికి తోడు దిల్‌రాజు, సునీల్‌ల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని తెలుస్తోంది. సినిమాపై నమ్మకం లేకపోవడంతోనే ఆయన ఎడిటింగ్ విషయంలో అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. దాంతో దిల్‌రాజుకే 'కృష్ణాష్టమి'పై నమ్మకం లేదనే రూమర్లు ఎక్కువయ్యాయి. మొత్తానికి ఏ విషయం మరి రెండు రోజుల్లో తేలిపోనుంది.